-తక్షణమే తరలించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి డిమాండ్....
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, జూన్ 7 మన వార్త : అల్వాల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డ్‌ను శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి, అల్వాల్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ భోగేశ్వరులు, సాయి రెడ్డి కాలనీ ప్రతినిధులు, జేఏసీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా విజయభారతి మాట్లాడుతూ, గత ఏడాది జూలైలో ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు కనిపించిన పరిస్థితులే ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రానున్నామని ముందస్తుగా తెలిసి కొంత శుభ్రత చర్యలు చేపట్టినా, గతంలో ఇక్కడ ఎలాంటి పరిశుభ్రత లేకుండా ఉన్న వాస్తవాలను స్వయంగా చూశామని పేర్కొన్నారు.హిందూ స్మశానవాటిక ప్రాంగణంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె, ప్రజల కోసం ఒక వ్యక్తి దానం చేసిన స్థలాన్ని చెత్త నిల్వ కేంద్రంగా ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ స్థలంపై అధికారిక హక్కులు ఉన్నట్లయితే సంబంధిత ఆధారాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్-2016 ప్రకారం స్మశానవాటికల సమీపంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయరాదని, అయినప్పటికీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా చెత్త నిల్వ చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మా, మెడికల్, ఈ-వేస్ట్, రసాయన వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలుస్తున్నాయని, తాను స్వయంగా పరిశీలించినప్పుడు దాదాపు 25 అడుగుల లోతులో ఉన్న నిచ్చెన కూడా వ్యర్థ పదార్థాల్లో మునిగిపోయినట్లు గమనించానని తెలిపారు.
వ్యర్థాలు భూగర్భ జలాల్లోకి చేరడం వల్ల ప్రజలు, పశువులు కలుషిత నీటిని వినియోగించే ప్రమాదం ఉందని, అలాగే డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన కారణంగా స్థానికులు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కల్పించిందని, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే ప్రభుత్వం వారికి కనీస మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా స్థానికులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పరిష్కారం చూపకపోవడం విచారకరమన్నారు.డంపింగ్ యార్డ్‌ను తరలించేందుకు ప్రత్యామ్నాయంగా నాలుగు స్థలాలను పరిశీలించామని, అవి దూర ప్రాంతాల్లో ఉన్నాయని అధికారులు చెప్పడం ఆశ్చర్యకరమని విజయభారతి వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా స్మశానవాటికలోని (రాంకీ ) నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా స్పందించిన అల్వాల్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ భోగేశ్వరులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తొలుత రెండు వారాల గడువు కోరిన అధికారులు, ప్రజల విజ్ఞప్తి మేరకు 15 రోజులలోగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు వెల్లడించారు.స్థానికులు కూడా డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. ప్రస్తుతం ఈ అంశం మచ్చ బొల్లారం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
Telangana
మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం...
Quick Summary:
మన వార్త,అల్వాల్