ఎల్బీనగర్ మెయిన్ రోడ్డులో భారీ అక్రమ నిర్మాణం.
* బాధ్యతలు మరిచి చర్యలు తీసుకోని అధికారులు.
* మామూళ్లకు అలవాటు పడిన టౌన్ ప్లానింగ్ అధికారులు.
తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 10, మనవార్త.
ఎల్బీనగర్ సర్కిల్ లోని రాక్ టౌన్ కాలనీ మెయిన్ రోడ్డులో మరో భారీ అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. అధికారుల నుంచి కేవలం G+2 నిర్మాణానికి మాత్రమే అనుమతులు పొందిన ఓ బిల్డర్, నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ సెల్లార్‌తో పాటు G+4 అంతస్తుల వరకు నిర్మాణం చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారిపై నిర్మాణం బహిరంగంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, అనుమతులకు మించి అంతస్తులు నిర్మించడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ తవ్వకం, నిర్మాణ పనులు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల వ్యాపార ప్రయోజనాల కోసం పట్టణ ప్రణాళిక నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో ట్రాఫిక్, పార్కింగ్, మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణ ప్రజలు చిన్నపాటి మార్పులు చేసినా నోటీసులు జారీ చేసే అధికారులు, ఇలాంటి భారీ అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగమే మౌనంగా ఉండటం వెనుక కారణాలేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతి G+2 అయితే సెల్లార్‌తో పాటు G+4 నిర్మాణం ఎలా జరుగుతోంది...? టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు...?
అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది?
అక్రమ నిర్మాణాలకు అధికారుల అండదండలు ఉన్నాయా...? రాక్ టౌన్ కాలనీలో కొనసాగుతున్న ఈ నిర్మాణంపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Telangana
ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం.
Quick Summary:
భాస్కర్ చారి మనవార్త స్టేట్ బ్యూరో