అల్వాల్‌లో విషాదం
ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ,
ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు.
అల్వాల్, జూన్ 12 (మన వార్త):మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌లో ఓ మహిళ మృతి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. చిన్న గాయానికి చికిత్స కోసం వెళ్లిన మహిళకు ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, అల్వాల్ సిటిజన్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభావతి (50) అనే మహిళకు చేతి చిన్న చూపుడు వేలికి గాయం కావడంతో స్థానికంగా ఉన్న ఎక్సెల్ హాస్పిటల్‌కు చికిత్స కోసం వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమెకు తీవ్ర గుండెనొప్పితో పాటు ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ పరిస్థితిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర వైద్యం అవసరమని చెబుతూ మరో ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు బంధువులు తెలిపారు. అనంతరం ఆమెను మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు ఆక్సిజన్ సహాయంతో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని, చికిత్స కోసం సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. అనంతరం వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించగా, కొద్ది సమయంలోనే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.మృతురాలు నల్గొండ జిల్లా వెంకటంపేట గ్రామానికి చెందినవారని, ఆమె భర్త లక్ష్మీపతి కార్పెంటర్‌గా పనిచేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రభావతి మృతికి ఎక్సెల్ హాస్పిటల్‌లో ఇచ్చిన మొదటి ఇంజక్షన్ కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట మృతదేహాన్ని ఉంచి నిరసన చేపట్టారు. "వి వాంట్ జస్టిస్", "బాధ్యులపై చర్యలు తీసుకోవాలి" అంటూ నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళ నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లి చివరకు మృతదేహంగా ఇంటికి రావడం తమను తీవ్రంగా కలిచివేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి పరిస్థితిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.అయితే మహిళ మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక, వైద్య నిపుణుల విచారణ అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Medchal -Malkajgiri District
అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు.
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని

