సమ్మక్క-సారక్క బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో రేగుమాకు వాగు పొంగి NH-163 నీట మునిగింది - 25 గ్రామాలకు స్తంభన
వాజేడు జులై 30 మనవార్త
ఎగువున ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద వచ్చింది.టేకులగూడెం గ్రామం వద్ద ఉన్న సమ్మక్క-సారక్క బ్యారేజ్ ప్రాజెక్టు గేట్లన్నీ పైకి ఎత్తడంతో రేగుమాకు వాగుకు భారీగా వరద నీరు చేరింది.దీంతో ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద 163 వ జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగింది.తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న ఈ రోడ్డు మునిగిపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు మునిగిపోవడంతో ఇరువైపులా ఉన్న భారీ వాహనాలు, ప్రయాణికుల వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.ఇప్పటికే చీకుపల్లి వద్ద ఇసుక వాగు డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో, టేకులగూడెం వద్ద రోడ్డు మునిగిపోవడంతో 25 గ్రామాలకు రవాణా పూర్తిగా స్తంభించింది.ఆ 25 గ్రామాల ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.రోడ్డు నీట మునిగిపోవడంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, అంబులెన్స్ సౌకర్యం, గృహనిర్మాణానికి సిమెంట్, స్టీల్, ఐరన్ తదితరాలు గ్రామాలకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టేకులగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీ చిడెం బాలకృష్ణ గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి రోడ్డుపై వాహనాలు అటు ఇటు వెళ్లకుండా బ్యారికేడ్లు, గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయించారు. వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సర్పంచ్ విజ్ఞప్తి చేస్తున్నారు.
Telangana
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాకపోకలు బంద్ _రేగుమాకు వాగు పొంగి జాతీయ రహదారి జలమయం
Quick Summary:
కవిరాజు

